సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులే కాదు నోరూరించే పిండివంటలకూ ఈ పండుగ ప్రత్యేకత. సంక్రాంతి అంటే...ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలయ్యేది ఒకప్పుడు. ఊరంతా నెయ్యి వాసనతో గుబాళించేది. పండగ వంటలు చేయడంలో ఊరు ఊరంతా బిజీగా ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా పిండి వంటలు స్వగృహాల్లో కాకుండా... 'స్వగృహ ఫుడ్స్'లో తయారవుతున్నాయి. రెడీమేడ్ దుస్తులు, రెడీమేడ్ నగల్లాగే వీటిని కూడా రెడీమేడ్‌గా కొనుక్కుని 'సంక్రాంతి' జరుపుకుంటోంది నవతరం.
ఇక సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు రంగవల్లికలే కాదు రుచిరకమైన పిండివంటలకు ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందునుండే పిండివంటలు చేయడం మొదలెడుతారు. అరిసెలు ,సకినాలు ,మురుకులు, బొబ్బర్లు, పూర్ణాలు ఈ పండుగ ప్రత్యేక వంటలు. ఉద్యోగాలు వ్యాపారాల పేర్లతో పల్లెలన్నీ పట్నాలకు తరలడంతో పిండివంటలు చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. స్వగృహ పుడ్స్ అందుబాటులోకి రావడంతో పట్నం ప్రజలంతా సంక్రాతి పిండి వంటలను సులువుగా కొనేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ స్వీట్స్ కష్టం లేకుండా స్వగృహ పుడ్స్ పట్నం వాసులకు అందిస్తున్నాయి. సున్ని ఉండలు, అరిశెలు, జంతికలు, గులాబీ పువ్వులు, బూందీ ఉండలు, కజ్జికాయలు, పోకుండలు, పూతరేకులు, కారపు బూందీ అన్ని రకాల సంక్రాంతి పిండివంటలు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చేశాయి. స్వగృహ పుడ్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నోరూరించే సంక్రాంతి పిండివంటలు నగర వాసులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే జనరేషన్ మారింది. అది పెళ్లయినా, పండగైనా చకచకా జరిగిపోవాల్సిందే అంటోంది నేటి తరం. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పండగలకు ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది కొద్ది సమయమే కాబట్టి...ఆ కాస్త సమయాన్ని పిండి పదార్థాలు తయారుచేసుకుంటూ గడపడమెందుకు? అని ఎదురు ప్రశ్నిస్తోందీ జనరేషన్. ఈ ప్రశ్నకు వారిని సంతృప్తి పరిచే సమాధానం తెలియక పెద్దవాళ్ళు ఇంతకాలం స్వగృహాల్లో చేసుకున్న పండగ పిండి వంటల కోసం 'స్వగృహ ఫుడ్స్'ను వెదుక్కుంటూ వస్తున్నారు. దీంతో నగరాల్లోని స్వగృహ ఫుడ్స్ పండగ శోభను సంతరించుకుంటున్నాయి. నేటి జిజీ లైఫ్‌లో వంట చేసుకునేందుకే తీరిక లేదు... ఇక పండగలకు పిండి వంటలు చేసుకునేంత ఓపిక ఎవరికి మాత్రం ఉంటుంది? ఈ పాయింటే స్వగృహఫుడ్స్‌కు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. పండగ సీజన్ వచ్చిందంటే చాలు అవి చేతినిండా ఆర్డర్స్‌తో క్షణం తీరిక లేకుండా కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి పెద్ద నగరాల్లోనే కాదు...వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, తిరుపతి, కర్నూలు వంటి పెద్ద పట్టణాల్లో సైతం స్వగృహ ఫుడ్స్ షాపులు పండగ సీజన్లో బిజీగా ఉంటున్నాయి. పండుగకు పిండివంటలు చేసే ఓపిక తీరిక లేక వీటిమీద ఆదారపడుతున్నామని కస్టమర్లంటున్నారు. అరిసెలు, సకినాలు, బొబ్బట్లు, జంతికలు, బూరెలు, కజ్జికాయలు, నువ్వుల లడ్డూ వంటి సంక్రాంతి స్పెషల్ ఐటెమ్స్ ఒక్కో షాపులో రోజుకు సగటున 100 కిలోల దాకా అమ్ముడవుతున్నాయంటే వీటికి ఉన్న గిరాకీని ఊహించొచ్చు. అయితే ఆ విషయాన్ని స్వగృహ యజమాని తెలుపుతూ...సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు, సకినాలు, జంతికలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్లు నెల ముందే ఆర్డర్లు ఇస్తారు. ఊళ్లకు వెళ్లేవారు కూడా మా దగ్గరికి వచ్చి పండగ స్వీట్లు, హాట్లను ప్యాక్ చేయించుకుని వెళ్తారు. మేం కూడా ఈ వారం, పది రోజులు మిగతా స్వీట్లను పక్కన పెట్టి వీటిపైనే దృష్టి పెడతాం. ఆ రోజుల్లో రోజుకు సుమారు 300 కిలోల అరిసెలు, 100 కిలోల సకినాలు, జంతికలు అమ్ముతాం'' అని హైదరాబాద్ అమీర్‌పేటలో ఉన్న స్వగృహ ఫుడ్స్ యజమాని అన్నారు. సాధారణంగా పండగలకు, ఫంక్షన్లకు స్వీట్లను గిఫ్ట్ ప్యాకులుగా అందించడం అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో పండగలకు సాంప్రదాయ పిండి వంటలను గిఫ్టులుగా అందించే ట్రెండ్ మొదలయ్యింది. హైదరాబాద్‌లోని చాలా స్వగృహఫుడ్స్ ఇలాంటి గిఫ్ట్ ప్యాకులు అందిస్తున్నాయి. పండగలకు ఇళ్లలో ఎవరూ పిండి వంటలు చేసుకోవడం లేదు కాబట్టి వెరైటీగా వాటినే గిఫ్ట్ ప్యాకులుగా అందిస్తే బాగుంటుందనుకుంటున్నారు చాలామంది. వీటిని విదేశాల్లోని మిత్రులకు, బంధువులకు కూడా పంపించే ఏర్పాట్లున్నాయి. మొత్తానికి 'రెడీమేడ్' అనే పదం నెమ్మది నెమ్మదిగా పండగ పిండివంటల్లోకి కూడా దూరింది. ఒక చేత్తో రెడీమేడ్ దుస్తులు, మరో చేత్తో రెడీమేడ్ పిండి వంటలను కొనుక్కుని నవతరం 'స్వగృహా'ల్లో పండగ చేసుకోవడమనే సరికొత్త సాంప్రదాయానికి తెర తీసింది.
రాష్ట్రంలో సంక్రాంతి శోభ నెలకొంది. సంక్రాంతి పండుగ రోజు తెల్లవారుజామున ఇంటి ముందు కళ్లాపి జల్లి, ఆడపడుచులు వేసిన ముత్యాల ముగ్గులో, రత్నాల గొబ్బిళ్లు కొలువుదీరతాయి. ఊరంతా పసుపు పరచుకున్నట్టుగా కనిపించే ముద్దబంతులతో సంక్రాంతికి కొత్త శోభను తీసుకొస్తాయి. జనవరి మాసం వచ్చిందంటే చాలు ఊళ్లన్నీ పండుగ శోభతో కళకళలాడతాయి. సంక్రాంతి రోజున హరిదాసుల పాడే కీర్తనలు, డూడూ బసవన్నల నాదస్వరాలు అందరినీ అలరిస్తాయి.ఇక సంక్రాతి పండుగలో వంటలకు ఒక ప్రత్యేకత ఉంది. కళ్లాల నుంచి కొత్త ధాన్యం నట్టింటికి రాగానే వచ్చే మొదటి పండుగ కావడంతో ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే వేళ ఇంటిలో ధాన్యలక్ష్మి కొలువుదీరాలని ప్రతీ ఒక్కరూ ఆరాటపడతారు. అందుకే అందరూ హడావిడిగా ధాన్యాన్ని ఇంటికి తరలిస్తారు. సంప్రదాయం ప్రకారం ఈ పండుగకు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. ఇదంతా ఒక ఎత్తయితే పండుగ సందడి మరో ఎత్తు. కొత్త అల్లుళ్లు, ఆడపడుచుల రాకతో ప్రతీ ఇల్లు ఎంతో సందడిగా మారుతుంది. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పండగకు పల్లెలకు చేరడంతో ఊళ్లన్నీ సందడిగా మారతాయి.
మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరానికి భోగి పండుగ మొదటి రోజు. ఈ పండగ రోజు జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటూ, పాత వస్తువులన్నీ మంటల్లో వేసి కాలుస్తారు. ఇందుకోసం వస్తువులను సేకరించేటప్పుడు చిన్నా, పెద్దా అంతా పోటీ పడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. పెద్దలు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ఇళ్లలో ఆడవాళ్లయితే గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. పండుగ రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగిస్తారు. మూడు, నాలుగు గీతల వరసల్ని ముగ్గులుగా వేస్తారు. అందులో ఎంతో అర్థం వచ్చేలా మగువలు అందంగా ముగ్గులు వేస్తారు. చిన్నా, పెద్దా అంతా ఒక్క చోటకు చేరి రకరకాల ఆటలు ఆడతారు. ఇక కోనసీమ కోడి పందాలకు పెట్టింది పేరు. కోళ్ల పందెంలో గెలవడం కొందరు తమ ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తారు. ఇక చివరి రోజు కనుమ పండుగ సంబరాలు అంబరాన్నంటుతాయి. ముక్క కొరకకుండా పండుగ పూర్తి కాదు. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల జ్ఞాపకాలను మనస్సులో దాచుకొని పల్లెలకు వచ్చిన వారంతా మళ్లీ తిరుగు ప్రయాణమవుతారు.
కాలక్రమంలో సంక్రాంతి పిండి వంటలు సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు సున్ని ఉండలు, అరిశెలు, జంతికలు, గులాబీ పువ్వులు, బూందీ ఉండలు, కజ్జికాయలు, పోకుండలు, పూతరేకులు, కారపు బూందీ ఇలా చెప్పుకుంటూపోతే అనేక రకాలు ఉండేవని వాటి సంఖ్య ఇప్పుడు తగ్గుతోందని పెద్దలంటున్నారు. సంక్రాంతి పండుగ 20 రోజులు ఉండగానే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఒకరికొకరు సాయపడుతూ రాత్రి పూట రోజుకొకరు వంతున రోకళ్ళతో పిండి కొట్టుకునే వారని, అటువంటి సవ్వడి నేడు కానరావడం లేదంటున్నారు. పండుగలన్నింటిలో కన్నా పెద్ద పండుగ కావడంతో పిండి వంటలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారని, పండుగకు పది రోజులు ముందు, పండుగ అనంతరం మరో 15 రోజుల పాటు పిండి వంటలు ఇళ్ళల్లో ఉండేవని, కమతాల్లో పనిచేసే కూలీలకు, పాలేర్లకు, చాకళ్ళకు, మంగళ్ళకు, వారితో పాటు బంధువులకు వారు తయారు చేసిన పిండి వంటలు పంచిపెట్టేవారని, అటువంటివి నేడు కానరావడం లేదని ఇంకొందరు పెద్దలు అంటున్నారు. ప్రస్తుత కాలంలో గతానికి, ఇప్పటికి ఊహించని రీతిలో ధరలు పెరిగిపోవడం ఒక కారణం కాగా, పురాతన వంటకాలు నేడుతినే వారు అంతగా లేకపోవడంతో సంక్రాంతి పిండి వంటలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఇవన్నీ ప్రక్కకు పెడితే ముఖ్యంగా ఈ పిండి వంటలు చేయడం నేటి మహిళలు చాలా మందికి తెలియదని, అలాగే, తీరిక, ఓపిక వంటివి లేకపోవడం మరికొన్ని కారణాలుగా ఇంకొందరు పేర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సైతం మార్కెట్‌లో లభ్యమయ్యే వివిధ రకాల స్వీట్లు, కోవా ఐటమ్స్, మిక్చర్ వంటివి వారి అవసరాల మేర కొనుగోలు చేసుకుని పండుగ వెళ్ళకుండానే చేతులు కడుక్కుంటున్నారు.
సంక్రాంతి పండుగను విదేశాల్లో కూడా తెలుగు వారు జరుపుకొంటుండంతో అక్కడి వారు కూడా ఇక్కడ స్వగృహ స్వీట్స్ పైనే ఆధారపడ్డారు. సంక్రాంతి పిండివంటలను హైదరాబాద్ నుండి దిగుమతి చేసుకుంటుండటంతో ఎక్స్ పోర్ట్ వ్యాపారం బాగా పెరిగిందని వ్యాపారస్తులంటున్నారు. ఈసారి సంక్రాంతి పండుగ కోసం స్వగృహ పుడ్స్ ప్రత్యేక మైన ఏర్పాట్లు చేశాయి. పండుగ పేరుతో ప్రత్యేక మైన గిప్ట్ ప్యాక్ లను తయారు చేశారు. పండుగ ప్రత్యేక వంటలైన సున్ని ఉండలు, అరిశెలు, జంతికలు, గులాబీ పువ్వులు , బూందీ ఉండలు, కజ్జికాయలు, పోకుండలు, పూతరేకులు, కారపు బూందీ తయారు చేశారు. పండుగ కోసం బారీగా ఆపర్లు కూడా వచ్చాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక్కడి వారకాకుండా విదేశాలనుండి భారీగా ఆపర్లు వచ్చాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలనుండి తమకు ఆపర్లు వచ్చాయని అక్కడికి అరిసెలు, సకినాలు, బొబ్బెర్లు పంపించామని వారు చెబుతున్నారు. గతేడాదికంటే ఈసారి కొనేవారి సంఖ్య రెండితలు పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సంక్రాంతి సంబరాలు ప్రజలకే కాదు వ్యాపారస్తులకు మంచి ఆనందానిస్తున్నాయి. పిండి వంటలు వ్యాపరం తో పాటు బట్టలు, బంగారం సేల్స్ కూడా బాగా పెరగడంతో పండుగ అన్ని వర్గాలను అలరిస్తోంది.