సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ఆహార పదార్థాలు, తినుబండారాల ధరలను ఎమ్మార్పీకే విక్రయించాలన్న నిబంధనలు ఆగష్టు 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు
తూనికలు, కొలతలు శాఖ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ లీగల్ మెట్రాలజీ విభాగం చీఫ్ కంట్రోలర్ అకున్ సబర్వాల్ సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల యజమానులను హెచ్చరించారు. గరిష్ఠ చిల్లర ధరలను సినీ ప్రేక్షకులకు, కస్టమర్లకు కనిపించేలా బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన అకున్ సబర్వాల్ తమకు ప్రేక్షకుల నుంచి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రేపటి నుంచి హైదరాబాద్ పరిధిలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని, నిబంధనలను ఉల్లంగిస్తే భారీ జరిమానా, విధిస్తామని జైలుశిక్ష తప్పదని చెప్పారు. జిల్లాల పరిధిలోని థియేటర్లలో నాలుగో తేదీ నుంచి సోదాలు ఉంటాయని తెలిపారు. ఎవరైనా అధిక ధరలకు టిక్కెట్లు అమ్మితే వీడియోలు తీయాలని, వాటిని వాట్సాప్ నంబర్ కు పంపాలని, అలాగే టోల్ ఫ్రీ నంబర్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నెంబర్ 73307 74444ను ప్రేక్షకులకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు.