అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐకియా హోం ఫర్నిషింగ్ సంస్థ భారత దేశంలో తన మొదటి స్టోర్‌ను హైటెక్స్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా
గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఐకియా గ్రూప్ సీఈవో జెస్పర్ బ్రోడిన్ తో పాటు ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్, తెలంగాణ మంత్రి కేటీఆర్, పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఐకియా రీటైల్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించేందుకే ఈ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడి లక్ష్యంకాగా పెట్టుకున్నామని ఇప్పటికే వివిధ స్టోర్ల మీద రూ.4,500 కోట్లు ఇన్వెస్ట్ చేశామని సీఈఓ తెలిపారు. ఇందులో హైదరాబాద్ స్టోరు కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేశామని ఐకియా భారత సీఈఓ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే దేశంలో తొలి స్టోర్‌ను ప్రారంభించగలిగామన్నారు.
ఇండియాలో ఐకియా స్టోర్ మొదట హైదరాబాద్‌లో ప్రారంభం కాగా, తర్వాత దేశ మంతటా విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఏడాది ముంబైలో రెండో స్టోర్ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. అనంతరం బెంగళూరు, ఢిల్లీలోనూ ఐకియా స్టోర్లు ఏర్పాటు చేస్తమన్నారు. ఇక ఐకియ కంపెనీ ద్వారా రాష్ట్రంలో దాదాపు 2వేల మందికి ప్రత్యక్షంగా, 3వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని కేటీఆర్ అన్నారు.
హైటెక్ సిటీ వద్ద 13 ఎకరాల స్థలంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకియా స్టోర్ నిర్మించారు. 7,500 రకాల వస్తువులు ఐకియా స్టోర్ లో లభించనున్నాయని కంపెనీ తెలిపింది వీటిలో 1000 ఉత్పత్తులు ఇండియాలో తయారుచేసినవేనట. స్టోర్ లో 1000 సీట్ల కెపాసిటీతో రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్లో 50 శాతం స్వీడిష్, 50 శాతం ఇండియన్ వంటకాలతో మెనూ సిద్ధం చేస్తున్నారు. ఇక ఐకియా స్టార్ లో పనిచేసేందుకు 950 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగా, ఇందులో 50 శాతం మహిళలే ఉంటారని కంపెనీ పేర్కొంది. పరోక్షంగా మరో 1,500 మందికి ఉపాధి లభిస్తోంది. ధరల విషయంలోనూ ఐకియా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. రూ.200 లోపే లభించే వస్తువులు 1000 రకాల వరకు ఉన్నాయని కంపెనీ మేనేజర్లు తెలిపారు.