దిల్లీ: ఎన్నడూలేనంతగా దేశ చరిత్రలో తొలిసారిగా డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడంతో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. భారత కరెన్సీ మార్కెట్లో
ఎలాంటి అస్థిరత ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశంలో సరిపోయేంత విదేశీ మారక నిల్వలలున్నాయని జైట్లీ ట్విటర్ వేదికగా బుధవారం చెప్పారు. ఎప్పటికప్పుడు పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని జైట్లీ తెలిపారు. కొద్దీ రోజుల క్రితం టర్కీ కరెన్సీ లీరా సంక్షభంతో విదేశీ మార్కెట్లపై దాని ప్రభావం పడడంతో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ కూడా బుధవారం రూ.70.58 పడిపోయింది. రూపాయితో పాటు వివిధ దేశాల కరెన్సీ విలువ కూడా భారీగా పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో ఆగస్టు 3 నాటికి 402.70 బిలియన్ డాలర్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ రంగంలోకి దిగే అవకాశం కూడా లేకపోలేదని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.