ముంబై: బడ్జెట్ ప్రయాణికులకు ఎంతో దగ్గరైన విమానయాన సంస్థ ఇండిగో... ప్రయాణికుల కోసం ఓ భారీ ఆఫర్ ప్రకటించింది. దాదాపు 10లక్షల సీట్లను అత్యంత చవకగా
ప్రయాణికులకు అందించేందుకు ఫెస్టివల్ సేల్ ను ఆరంభించింది.. అలాగే మొబిక్విక్ ద్వారా దాదాపు రూ.600 వరకూ 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నట్లు తెలిపింది. 2018 సెప్టెంబర్ 18 నుంచి 2019 మార్చి30 మధ్య ప్రయాణించేందుకు గానూ రూపొందించిన ‘ఫెస్టివల్ సేల్’ను సోమవారం నుంచి ఇండిగో కంపెనీ ప్రారంభించింది.
ఈ ఆఫర్ నాలుగు రోజులపాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశంలో అతి తక్కువ ధరలోనే విమాన టికెట్లను అందిస్తున్నందున ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని భావిస్తున్నామని ఇండిగో ముఖ్య వాణిజ్య అధికారి విలియం బౌల్టర్ పేర్కొన్నారు. గతంలోనూ 1.2మిలియన్ల సీట్లను రూ.1212 ప్రారంభ ధరతో టికెట్లను ఇండిగో విక్రయించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇండిగో దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 52 గమ్యస్థానాలకు 1,100 విమానాలను నడుపుతోంది.