ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
నిర్మలా సీతారామన్. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... భారత్ ను వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్‌ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే.. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను కలిపి ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ బ్యాంక్‌ను అలహాబాద్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్ష చేస్తాయన్నారు. సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. గృహ, వాహనాల, తనఖా రుణాలను 8 ప్రభుత్వ బ్యాంకులు ప్రారంభించాయని తెలిపారు. రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయని నిర్మల చెప్పారు.
అలాగే... భారీ రుణాలు, మొండిబకాయిలపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ఇస్తున్న మద్దతును పొడిగిస్తామని తెలిపారు. మరో 30 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ రీఫండ్స్‌ను క్లియర్ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో 60 రోజుల్లో రీఫండ్స్‌ను విడుదల చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. పరిశ్రమలకు లాభం చేకూరేలా కేంద్రప్రభుత్వం త్వరలో మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకోనుందని ఆమె చెప్పారు.