ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశంపై అంతగా లేదని దేశ ద్రవ్యోల్బణం
అదుపులోనే ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటున్నామని, దీంతో దేశంలో పెట్టుబడులు మరింత పెరగనున్నాయని చెప్పారు. దేశీయ ఆర్థిక వృద్ధి రేటుపై నిర్మలా సీతారామన్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తయారీ రంగం వృద్ధిరేటు అతి తక్కువ 0.6 శాతానికి పడిపోయిందన్నారు. గత ఆరేళ్లలో ఇదే కనిష్ట వృద్ధిరేటుగా వెల్లడించారు. కాగా... 2019-20 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశించినస్థాయి లోనే ఉందని, ఎగుమతులపై పన్ను తగ్గింపు విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు చెప్పారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌తో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాట్లు చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో కీలక రేట్లు తగ్గింపుతో సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. దేశంలో మిగులు నిధులు అడుగంటే పరిస్థితి వచ్చిందని. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో రుణవితరణ పెరుగుతోందన్నారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌తో పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ నెల 19న బ్యాంక్ ఛైర్మన్లతో సమావేశం అవుతామన్నారు. ఐటీ రిటర్న్స్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవని స్పష్టం చేశారు. టెక్స్‌టైల్ రంగానికి మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతాయని చెప్పారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు టెక్స్‌టైల్ లాంటి రంగాలకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే రంగాలకు ప్రోత్సాహకం ఇస్తూ.. కొత్త ఎగుమతుల ప్రోత్సాహక విధానం ఉంటుందని వెల్లడించారు. ఎంఈఐఎస్ పథకాన్ని 2020, జనవరి 1వ తేదీన అమల్లోకి తెస్తామన్నారు. ఈ పథకం వల్ల టెక్స్‌టైల్ రంగాలతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పాత పథకం ఆర్‌వోడీటీఈఎస్ కూడా డిసెంబర్ వరకు కొనసాగుతుంది. పన్ను చెల్లింపుల్లో ఇ-అసెస్‌మెంట్ అనే విధానాన్ని అమలు చేస్తాం. వచ్చే మార్చిలో మెగా షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తాం అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.