హవేరి: హావేరిలోని భగత్ ప్రీ యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల అతిగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకుంది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు
పక్కచూపులు చూడకుండా వారి ముఖాలకు అట్టపెట్టెలు పెట్టించి మరీ అధ్యాపకులు పరీక్ష రాయించారు. తలలు పక్కకు తిప్పకుండా కళాశాల విద్యార్థులకు ఈ విధంగా ఇన్విజిలేటర్లు చుక్కలు చూపించారు. కళ్ల భాగం వరకు మాత్రమే తెరిచి ఉండేలా ముఖాలకు అట్టపెట్టెలు పెట్టించడంతో కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మొన్న బుధవారం జరగ్గా ఇందుకు సంబంధించిన ఫొటోలు విపరీతంగా వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. అయితే... ఆ ఫోటోలు కర్ణాటక విద్యా శాఖ దృష్టి వరకు వెళ్లడంతో ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కళాశాల యాజమయానికి నోటీసులు జారీ చేసింది.