వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు.
'వైసీపీ నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ళ రాజ్యాంగం, 73 ఏళ్ళ స్వాతంత్య్రం పరిహాసం పాలయ్యాయి. రక్తం చిమ్మి, ఎముకలు జల్లి యజ్ఞాలను భగ్నం చేయడం పురాణాల్లో విన్నాం. అంతకు మించిన రాక్షస కృత్యాలను ఇప్పుడే చూస్తున్నాం.' అంటూ ట్వీట్ చేశారు.
'దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా నివసించే హక్కుంది. ప్రాణాలు, ఆస్తులు కాపాడుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. అలాంటిది వైసీపీ వాళ్ల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా? నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా? ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాలరాస్తారా?' అంటూ మరో ఘాటైన ట్వీట్ చేశారు.
'పంట పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా? రోడ్లకు అడ్డంగా గోడలు కడతారా? కష్టపడి పెంచిన చీని చెట్లను నరికేస్తారా? పాడి గేదెలకు విషంపెట్టి చంపుతారా? ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? బోర్లు పూడ్చేయడం, పైపులు కోయడం... ఇవన్నీ రైతు కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా?' అని నిలదీశారు.
'మానవత్వం ఉన్నవారంతా ఈ అరాచకాలను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలి. ‘‘వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాసానికి’’ చేదోడుగా ఉండాలి.' అంటూ వరుస ట్వీట్లతో పిలుపునిచ్చారు.