తమ కాలు తామే నరుక్కుంటామన్నట్లుగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హుజూర్ నగర్ ఫలితం తర్వాత
ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు. సమ్మె విషయంలో ఉద్యోగుల తీరును తప్పు పట్టారు. ఆర్టీసీ ఉద్యోగికి సగటున నెలకు రూ. 50 వేల వేతనం వస్తోందన్నారు. కాస్త ఎక్కువ సమయమైతే ఓటీ అడుగుతారని చెప్పారు. అదే వ్యవసాయం చేస్తున్న రైతు కూడా ఉద్యోగుల్లాగే టైం చూసుకుంటారా అని ప్రశ్నించారు. దేశాన్ని బతికించే రైతుకు లేని టైం ప్రతి నెల ఠంచన్ గా వేతనాలు తీసుకునే ఉద్యోగులకు ఎందుకన్నారు కేసీఆర్.